Gali case: security to Konda Reddy | గాలి కేసు: కొండారెడ్డికి భద్రత- Oneindia Telugu
హైదరాబాద్: కర్నాటక మాజీ మంత్రి, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు గాలి జనార్ధన్ రెడ్డికి చెందిన ఓబుళాపురం మైనింగ్ కేసులో ముఖ్యమైన సాక్షిగా భావిస్తున్న కొండారెడ్డికి ప్రభుత్వం పోలీసు భద్రత కల్పించింది. టు ప్లస్ టు పద్ధతిలో నలుగురు గన్‌మెన్లను కేటాయిస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. గనుల కేసులో కొండారెడ్డి ప్రధానంగా తెరపైకి రావడంతో ఆయనకు ఎలాంటి ప్రమాదం జరగకుండా ప్రభుత్వమే గన్‌మెన్లను కేటాయించిందా? ఆయన ప్రధాన సాక్షిగా మారటంతో సిబిఐ సిఫార్సు చేసిందా? లేక ఆయనే తనకు భద్రత కావాలని కోరారా అనే విషయం మాత్రం తెలియరాలేదు.
గాలి గనుల అక్రమాలపై కేసును సిబిఐ అధికారులు దర్యాఫ్తు చేస్తున్న విషయం తెలిసిందే. విచారణలో భాగంగా కొండారెడ్డి తెర పైకి వచ్చారు. సిబిఐ ముందు ఆయన ఇచ్చిన వాంగ్మూలం కేసుకు చాలా ప్రధానమని తెలుస్తోంది. ఓఎంసికి కేటాయించిన గనుల కోసం గాలి కంటే తానే ముందు దరఖాస్తు చేసుకున్నప్పటికీ అప్పటి ప్రభుత్వ పెద్దల అండతో తనను బెదిరించి తనకు గనుల కేటాయింపు జరగకుండా చేశారని ఆయన వాంగ్మూలం ఇచ్చినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. నాలుగు రోజుల క్రితం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని సిబిఐ విచారించినప్పుడు కూడా కొండారెడ్డి సిబిఐ కార్యాలయంలోనే పక్క గదిలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. జగన్ ఒత్తిడి తెచ్చి గనులు గాలికి దక్కేటట్లుగా చూశారని ఆయన సిబిఐకి చెప్పారని తెలుస్తోంది.
No comments:
Post a Comment
తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.