ఈ పద్యం యొక్క తాత్పర్యం తెలుపగలరు

ఆత్మయందె దృష్టి ననువగా నొనరించి
నిశ్చలముగ దృష్టి నిలిపెనేని
అతడునీవె సుమ్మి యనుమానమేలరా
విశ్వధాభిరామ వినురవేమ!


గురువు యొక్క ఉపదేశమువల్లనే మనస్సునందు ఆత్మను నిశ్చల ఏకాగ్రతతో వీక్షించిన మోక్షమును లభించగలదు.ఇది గురువు యొక్క సేవ వలనే లభించును.

నాకు ఈ పద్యం లో సూచించిన తాత్పర్యం కనుబడుటలేదు.

నాకు అర్ధమైన తాత్పర్యం
ఆత్మయందు నిశ్చలమైన దృష్టి కలిగి ఆ దృష్టిని నిశ్చలముగా ఉంచితే నీకు నువ్వే కనబడతావు, అందులో అనుమానం ఎందుకు అని వేమన అన్నారు అనిపిస్తుంది. ఇంకో విధంగా చూస్తే నిశ్చలమైన దృష్టి ఆత్మయందు ఉంచితే నువ్వు చేస్తున్న పనులకు నీ నుంచే సమాధానం వస్తుంది అది మంచిదా చెడ్డదా అని.
కొంచం తెలపండి నా అనుమానం నిజమో కాదో.

1 comment:

  1. ఆత్మయందె దృష్టి ననువగా నొనరించి
    నిశ్చలముగ దృష్టి నిలిపెనేని
    అతడునీవె సుమ్మి యనుమానమేలరా
    విశ్వధాభిరామ వినురవేమ!

    వివరణ:
    స్థూలంగా మనం ఒక వ్యక్తిని అతడి దృశ్యమాన శరీరంతోటే అనుసంథానం చేస్తాము. ఒకరి పేరు చెప్పగానే గుర్తుకు వచ్చేది వారు రూపమే. అందుకే ప్రకృతిని నామరూపాత్మకమైనది అంటారు. అందుచేతనే యే వ్యక్తికైనా తన గురించి సాధారణంగా కలిగేది తన భౌతికమైన ఉనికి యొక్క నామరూపాత్మకమైన స్పృహ మాత్రమే.

    వేదాంతపరిభాషలో వ్యక్తిని దేహి లేదా పురుషుడు అంటారు. మనం కూడా యీ వివరణలో ఈ పదాలు వాడటం ఉచితం. నిజానికి దేహి తన యొక్క స్థూలస్వరూపంకన్నా భిన్నమైన వాడు. దేహం అశాశ్వతం. దానిలో నున్న దేహి శాశ్వతుడు. ఒక దేహం పోతే,చొక్కా మార్చినట్లు, మరొకదేహం ధరిస్తూ ఉంటాడు. ఈ దేహి కేవలం దివ్యాత్మ యొక్క అంశ.

    అయితే ప్రకృతి మాయ వలన శరీరం వెనుక శరీరం దాల్చుతూనే ఉంటాడు. ఈ శరీరం ఇంద్రియాలతో కూడి ఉంటుంది. ఇంద్రియాలు శరీరం అవసరాలు తీర్చటమే కాదు, దేహికి ఈ శరీరంతో తాదాత్మ్యం కలిగిస్తూ కూడా ఉంటాయి. ఈ ప్రభావాన్నే మాయ అంటాము. ఈ ప్రభావాన్ని కలిగించేది ముఖ్యంగా ఇంద్రియాలకు ఆధిపత్యం కలిగిన మనస్సు.

    ఈ మాయా ప్రభావంలో కొట్టుకు పోకుండా మనస్సు నిశ్చలంగా ఉంచగలగటం గొప్ప విషయం. అలా చేయగలిగినపుడు దేహికి తనయొక్క నిజస్వరూపాన్ని గురించి నిబ్బరంగా విచారించి తెలుసుకొనే అవకాశం కలుగుతుంది. దృష్టి నిశ్చలంగా నిలపటం అంటే ఇదే. ఇదే సమాథి. ఈ స్థితిలో ఆత్మ-అనాత్మలగురించి విచారం జరుగుతుంది. ఆత్మ యందు దృష్టి నిలబడుతుంది.

    నిజానికి ఆత్మ స్వరూపుడ అయిన పురుషుడు పరమాత్మ యొక్క అంశయే. అతడు (అంటే ఆ పరమాత్మ)యే తాను అని తనకు తాను తెలుసుకుంటాడు ఈ స్థితిలో.

    ఈ విషయంలో అనుమానం యేమీ అవసరం లేదు. ఇది నిజం అని వేమన చెబుతున్నాడు.

    ReplyDelete

తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.